ఫుట్‌బాల్ ప్రపంచంలో వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడటం ప్రతి ఆటగాడి కల. ఆ ట్రోఫీ విలువను డబ్బుతో కొలవలేం. అయితే అందులోని బంగారం విలువ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా బంగారం ధరల ర్యాలీతో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ విలువ గత టోర్నమెంట్‌తో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగి రూ.6.7 కోట్లకు చేరింది.
ఆర్థిక మార్కెట్ల డేటా సంస్థ LSEG అంచనాల ప్రకారం.. ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీలోని బంగారం విలువ సుమారు 7.13 లక్షల డాలర్లుగా (దాదాపు రూ.6.73 కోట్లు) ఉంది. 2022లో ఖతార్ వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా గెలిచిన సమయంలో ఇదే ట్రోఫీలోని బంగారం విలువ సుమారు 2.77 లక్షల డాలర్లు మాత్రమే.
ప్రస్తుత వరల్డ్‌కప్ ట్రోఫీని 1974లో ప్రవేశపెట్టారు. అప్పట్లో దాని బంగారం విలువ కేవలం 25 వేల డాలర్ల పరిధిలో ఉండేది. గత ఐదు దశాబ్దాల్లో బంగారం ధరలు ఎన్నో రెట్లు పెరగడంతో ట్రోఫీ విలువ కూడా భారీగా ఎగబాకింది. ఈ ట్రోఫీని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. మొత్తం బరువు 6.175 కిలోలు కాగా.. అందులో 4.93 కిలోల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితి, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపడంతో ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
ఇతర ప్రముఖ క్రీడా ట్రోఫీలతో పోలిస్తే ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రపంచంలోని ప్రధాన క్రీడా ట్రోఫీల్లో పూర్తిస్థాయిలో బంగారంతో తయారైన ఏకైక ట్రోఫీ ఇదే. యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ ట్రోఫీలు వెండితో తయారవుతాయి. వాటి లోహ విలువ వరుసగా 16,950 డాలర్లు, 22,600 డాలర్లే. అమెరికాలో ఇండియానాపోలిస్ 500 విజేతకు ఇచ్చే బోర్గ్-వార్నర్ ట్రోఫీ 69 కిలోల వెండితో తయారవుతుంది. అయినప్పటికీ దాని లోహ విలువ సుమారు 1.56 లక్షల డాలర్లే. దీంతో బంగారం విలువ పరంగా ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీకి పోటీగా మరే ట్రోఫీ కనిపించడం లేదు.
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ట్రోపీ విలువ ఎంతో తెలుసా?
