ప్రధాని నరేంద్ర మోదీపై విద్యార్థుల నిరసనలో అనుచిత వ్యాఖ్యలు చేసి, కేసులో ఇరుక్కున్న యువతి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆమె చేతులు జోడించి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరి మాటల ప్రభావంతో ప్రధానిపై తాను తీవ్రమైన వ్యాఖ్యలు చేశానని ఆమె అంగీకరించారు.
"నా వయసు కేవలం 15 సంవత్సరాలు. నేను చేసింది క్షమించరానిది. చాలా తప్పుడు మాటలు మాట్లాడాను" అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొన్నప్పటికీ, వీడియోలో తాను 15 ఏళ్ల బాలికనని చెప్పడం గమనార్హం. ఇదే తన మొదటి, చివరి తప్పిదమని, దేశం మొత్తం తనను క్షమించాలని వేడుకున్నారు. "నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను నేను చూసుకోలేకపోతున్నాను. దయచేసి క్షమించండి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు ప్రధాని కార్యాలయ గౌరవానికి భంగం కలిగించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఒకరు నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దానిని న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఈ క్షమాపణ వీడియో బయటకు రావడానికి కొన్ని గంటల ముందే, ప్రధాని మోదీ ఈ వివాదంపై స్పందించారు. విద్యార్థుల నిరసనలో తనపై చేసిన దూషణల పట్ల సంయమనం, క్షమాగుణం ప్రదర్శించాలని కోరుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో విడుదల చేశారు. "జంతర్ మంతర్ వద్ద ఏమి జరిగిందో దేశం, ప్రపంచం చూశాయి. దారితప్పిన కొందరు యువకులు సభ్యసమాజంలో చోటులేని భాషను ఉపయోగించారు. నన్ను, నా దివంగత తల్లిని కూడా దూషించారు" అని మోదీ అన్నారు.
అయితే వారిపై కోపం లేదా ప్రతీకారం సరైన మార్గం కాదని, దూషణలతో ఏ సమస్యా పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. "చిన్నతనంలో తప్పులు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ యువకులు దారితప్పిన పిల్లలు. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల పరిస్థితులు మారవు. వారిని అక్కున చేర్చుకుని సరైన మార్గం చూపించడం మన కర్తవ్యం" అని ప్రధాని హితవు పలికారు. తాను వారిని క్షమించాలనుకుంటున్నానని, సమాజం కూడా తన మాటను అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని పిలుపు తర్వాత ఈ క్షమాపణ వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
'నన్ను క్షమించండి.. నా వయసు 15 ఏళ్లే'.. ప్రధాని మోదీపై దూషణలకు సారీ చెప్పిన యువతి...
