హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. జూ పార్క్‌ ప్రవేశ రుసుముతో పాటు ఇతర సేవల చార్జీలను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన ధరలు నేటి (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా ధరల పెంపుతో జూ పార్క్ సందర్శన సామాన్యులకు మరింత భారం కానుంది.

పెంచిన ధరల ప్రకారం, పెద్దలకు ప్రవేశ టికెట్‌ ధరను రూ. 100 నుంచి రూ. 120కి, పిల్లలకు రూ. 50 నుంచి రూ. 60కి పెంచారు. జూలో అత్యంత ఆదరణ పొందే సఫారీ చార్జీలు కూడా పెరిగాయి. ఏసీ సఫారీ టికెట్‌ ధర రూ. 150 నుంచి రూ. 165కి, నాన్-ఏసీ సఫారీ టికెట్‌ ధర రూ. 100 నుంచి రూ. 110కి చేరింది.

ఇక బ్యాటరీ వాహనాల్లో ప్రయాణించేందుకు పెద్దలకు టికెట్ ధర రూ. 120 నుంచి రూ. 135కి, పిల్లలకు రూ. 70 నుంచి రూ. 75కి పెరిగింది. అలాగే టాయ్ ట్రైన్ టికెట్ ధర పెద్దలకు రూ. 80 నుంచి రూ. 90కి, పిల్లలకు రూ. 40 నుంచి రూ. 45కి సవరించారు.

వీటితో పాటు ఫిష్ అక్వేరియం టికెట్‌ ధరను రూ. 20 నుంచి రూ. 25కి, రెప్టైల్ హౌస్ టికెట్‌ను పెద్దలకు రూ. 30 నుంచి రూ. 35కి, పిల్లలకు రూ. 10 నుంచి రూ. 15కి పెంచారు. రాత్రిపూట సంచరించే జంతువుల ప్రదర్శనశాలను (నాక్టర్నల్ యానిమల్ హౌస్) సందర్శించేందుకు పెద్దలకు రూ. 25, పిల్లలకు రూ. 15గా రుసుమును నిర్ణయించారు. గడిచిన జూలై 13వ తేదీన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన తెలంగాణ జూస్ అండ్ పార్క్స్ అథారిటీ (జాపాట్) 15వ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.