విశాఖపట్నం విమానయాన చరిత్రలో ఒక శకం ముగిసి, కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఆగస్టు 17వ తేదీ నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో వాణిజ్య విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వాటి స్థానంలో విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి 00.01 గంటల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అదే సమయం నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ (INS డేగా)లోని సివిల్ ఎన్‌క్లేవ్‌లో విమాన సేవలు ఆగిపోతాయి. అయితే, జాతీయ అత్యవసర సమయాల్లో, భారత వాయుసేన, ఇతర సాయుధ దళాలు, పోలీసు విభాగాలు, ప్రభుత్వ వీఐపీ విమానాల రాకపోకలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ కోడ్ "VTZ" ను కూడా భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేశారు.
ఈ నూతన విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. నిర్దేశిత గడువు కంటే ఐదు నెలల ముందే, కేవలం 31 నెలల్లో దీని నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఇప్పటికే డీజీసీఏ ఏరోడ్రోమ్ లైసెన్స్‌తో పాటు భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులన్నీ లభించాయి.
మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను రూపొందించారు. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని 4 కోట్ల మందికి పెంచేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆర్థిక వృద్ధి, పర్యాటకం, పారిశ్రామిక పెట్టుబడులు, ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
2,703 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్రాజెక్టులో 2,203 ఎకరాలు విమానాశ్రయానికి, మిగిలినవి ఏవియేషన్ హబ్, ఏవియేషన్ యూనివర్సిటీలకు కేటాయించారు. బోయింగ్ 777, డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A330 వంటి భారీ విమానాలు సైతం సులభంగా దిగేందుకు వీలుగా 3,800 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించారు. అత్యాధునిక ఎయిర్‌ఫీల్డ్ లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, స్మార్ట్ సర్వైలెన్స్ వంటి సాంకేతికతలతో ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించేలా టెర్మినల్‌ను తీర్చిదిద్దారు.
ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి వాణిజ్య విమాన సేవలు..
