బాలీవుడ్ ‘షెహెన్‌షా’ అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) 18వ సీజన్ చిత్రీకరణకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు.

ముందుగా, గురు పౌర్ణమి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేబీసీ కొత్త సీజన్ గురించి ప్రస్తావిస్తూ.. షోకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిశాయని వెల్లడించారు. "ఇక అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. ఫైనల్ మాక్స్ పూర్తయ్యాయి, ఇక ప్రొడక్షన్, ప్రేక్షకులదే బాధ్యత" అని పేర్కొంటూ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకున్నారు.

"ఈసారి మా ప్రోమోలో చెప్పినట్లుగా.. కాస్త గట్టిగా ఆలోచించాల్సిందే (జరా సోచ్‌నా పడేగా)" అంటూ కొత్త సీజన్ ట్యాగ్‌లైన్‌ను ప్రస్తావించి, షోపై ఆసక్తిని పెంచారు. ఆగస్టు 1 నుంచి ఈ కార్యక్రమ చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఆగస్టు 10 నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ‘హు వాంట్స్ టు బీ ఏ మిలియనీర్?’ కార్యక్రమానికి అధికారిక హిందీ అనుకరణే ఈ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. మూడో సీజన్‌కు షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించగా, మిగిలిన అన్ని సీజన్లకు అమితాబ్ బచ్చనే వ్యాఖ్యాతగా కొనసాగుతూ ఈ షోకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు.