టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు అనుభవజ్ఞుడైన పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాలని సూచించాడు. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో భువనేశ్వర్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగలడని అభిప్రాయపడ్డాడు. అతణ్ని ఇప్పటి నుంచే దేశవాళీ టోర్నీల్లో ఆడిస్తూ ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని బీసీసీఐకి సూచించాడు.
2026 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఛాంపియన్‌గా నిలపడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. 28 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అయితే అతడు చివరిసారిగా 2022లోనే భారత్ తరఫున వన్డే ఆడాడు. అయినా అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అశ్విన్ పేర్కొన్నాడు.
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుపైనా అశ్విన్ స్పందించాడు. గాలే పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలని చెప్పాడు. ఏడో స్థానంలో సారాంశ్ జైన్‌ను ఆడిస్తే జట్టు సమతుల్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పైనా అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఇండియా-ఏ తరఫున గాలేలో సెంచరీ చేయడం అతడికి పెద్ద ప్లస్ అవుతుందని తెలిపాడు. శ్రీలంక స్పిన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం సాయి సుదర్శన్‌కు ఉందని చెప్పాడు. అతడు పూర్తి ఫిట్‌గా ఉంటే టీమిండియాకు పెద్ద బలమవుతుందని పేర్కొన్నాడు.
2027 ప్రపంచకప్‌కు అతణ్ని తీసుకోండి.. టీమిండియాకు అశ్విన్ సలహా..
