పోలీస్ శాఖ అంతర్గత క్రమశిక్షణ, పోలీస్ ప్రతిష్ఠ విషయంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి శిఖర పూజలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల చోటుచేసుకున్న వరుస వివాదాలపై స్పందిస్తూ, విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగత ప్రవర్తనలో గానీ హద్దులు దాటే అధికారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణల కేసు విచారణ పూర్తిగా నిష్పాక్షికంగా కొనసాగుతుందని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని సజ్జనార్ తెలిపారు. ఏ స్థాయి అధికారి అయినా అక్రమ సంబంధాలు, వేధింపులకు పాల్పడినట్లు తేలితే డిపార్ట్‌మెంట్ తరఫున కఠిన చర్యలు తప్పువని హెచ్చరించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్, మలక్‌పేట్, దోమలగూడ ఠాణాల పరిధిలోని ఘటనలు, ట్రైనీ ఐపీఎస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్ చేశామని గుర్తుచేశారు.
ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) ద్వారా నిఘా ఉంచి, వివాదాస్పద పోలీసుల వివరాలు సేకరిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. పోలీస్ శ్రేణులు తమ ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలని, యూనిఫాం చాటున అనాలోచిత చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. బాధితులకు న్యాయం అందించడమే పోలీస్ వ్యవస్థ ప్రాథమిక కర్తవ్యమని, కొందరు వ్యక్తుల వల్ల మొత్తం శాఖకు మచ్చ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
