పండ్ల ధరలు రూ.వందలు, వేలు ఉండటం సహజం. కానీ ఒక జత పండ్ల కోసం ఏకంగా రూ.34 లక్షలు చెల్లిస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. జపాన్‌కు చెందిన ‘యుబారి కింగ్ మెలన్’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ పండ్ల జత వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడై మరోసారి వార్తల్లో నిలిచింది.
2026 మేలో జపాన్‌లోని సప్పోరో సెంట్రల్ హోల్‌సేల్ మార్కెట్‌లో నిర్వహించిన సీజన్ తొలి వేలంలో యుబారి కింగ్ మెలన్ జత 58 లక్షల యెన్‌లకు అమ్ముడైంది. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.34 లక్షలు. అయితే ఇది సాధారణ విక్రయ ధర కాదని నిపుణులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభ వేలాలకు ప్రతిష్ఠ ఎక్కువగా ఉండటంతో ప్రచారం, గౌరవం కోసం కొనుగోలుదారులు భారీగా బిడ్‌లు వేస్తుంటారు. అందుకే ఇలాంటి రికార్డు ధరలు నమోదవుతుంటాయి.
అయితే ప్రతి యుబారి కింగ్ మెలన్‌కు ఇంత ధర ఉండదు. సాధారణంగా ఒక్క పండు 20 వేల నుంచి 50 వేల యెన్‌ల మధ్య విక్రయమవుతుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.12 వేల నుంచి రూ.29 వేల వరకు ఉంటుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన గిఫ్ట్ గ్రేడ్ మెలన్‌లు మాత్రం వేలం కాకపోయినా లక్ష యెన్‌లకు పైగా, అంటే రూ.60 వేలకుపైగా విక్రయమవుతుంటాయి.
ఈ మెలన్‌కు ఇంత విలువ రావడానికి దాని సాగు విధానమే ప్రధాన కారణం. ఎర్ల్స్ ఫేవరెట్, బర్పీస్ స్పైసీ కాంటాలోప్ రకాల సంకరజాతిగా దీనిని అభివృద్ధి చేశారు. జపాన్‌లోని యుబారి ప్రాంతంలో గ్రీన్‌హౌసుల్లో అత్యంత కట్టుదిట్టమైన పద్ధతుల్లో సాగు చేస్తారు. ఉష్ణోగ్రత, పరాగసంపర్కం, నీటి సరఫరా వంటి ప్రతి అంశాన్ని రైతులు జాగ్రత్తగా నియంత్రిస్తారు. దీంతో గుండ్రటి ఆకారం, అందమైన వలల మాదిరి తొక్క, నారింజ రంగు గుజ్జు, అధిక తీపితో ఈ పండ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
జపాన్‌లో ప్రీమియం పండ్లను ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇవ్వడం ఓ సంప్రదాయం. యుబారి కింగ్ మెలన్‌కు కూడా అలాంటి గౌరవమే ఉంది. పరిమిత ఉత్పత్తి, కఠినమైన నాణ్యత ప్రమాణాలు, ప్రత్యేక సాగు పద్ధతులు, సాంస్కృతిక ప్రాధాన్యం కలిసి ఈ పండును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్ల జాబితాలో నిలబెట్టాయి.
ఈ పండు ధరతో లగ్జరీ కారు కొనొచ్చు.. రెండింటి విలువ రూ.34 లక్షలు!
