పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో చెలరేగిన హింసపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన దమనకాండలో 40 మందికి పైగా పౌరులు మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పలువురు బ్రిటిష్ పార్లమెంటేరియన్లు, మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా స్పందించాయి.
బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ లియామ్ బైర్న్ మాట్లాడుతూ.. పీఓకేలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరపడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. కమ్యూనికేషన్లపై నిషేధం విధించడం, మానవ హక్కులను ఉల్లంఘించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ హింసను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్‌తో చర్చలు జరపాలని, పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తమ విదేశాంగ శాఖను కోరనున్నట్లు తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించి, కశ్మీరీల హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో బ్రిటిష్ ఎంపీ అద్నాన్ హుస్సేన్ ఈ ఘటనను ఒక 'విషాదం'గా అభివర్ణించారు. పాక్ బలగాలు పరిమితికి మించి బలప్రయోగం చేసిన ఘటనపై పూర్తిస్థాయి, స్వతంత్ర, పారదర్శక విచారణ జరగాలని కోరారు.
ప్రముఖ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా పాకిస్థాన్ తీరును తీవ్రంగా విమర్శించింది. నిరసనకారులపై పాక్ చాలా కాలంగా అనుసరిస్తున్న అక్రమ హింసా విధానానికి ఈ ఘటనే నిదర్శనమని ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కాలమర్డ్ అన్నారు. పీఓకేలో ఇంటర్నెట్, మొబైల్ సేవలపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, మీడియాను, స్వతంత్ర పరిశీలకులను అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆమె 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
పీఓకేలో పాక్ బలగాల కాల్పులు.. 40 మందికి పైగా పౌరుల మృతి..
