తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని, మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులను పక్కదారి పట్టిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయాలంటూ పంచాయతీ అధికారులపై, సర్పంచులపై ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కలకు బండి సంజయ్ లేఖలు రాశారు.
సర్పంచులు తమకు ఎదురవుతున్న ఒత్తిళ్లపై ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదులను లేఖలకు జత చేసినట్లు ఆయన తెలిపారు. "గ్రామీణ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థే మూలస్తంభం. ఇక్కడ నిధులు పక్కదారి పడితే గ్రామాల అభివృద్ధి స్తంభించిపోవడమే కాకుండా, పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది" అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని, ఆధారాల ఆధారంగా పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
