పశ్చిమ బెంగాల్‌లో భారీగా నగదు, బంగారం పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి బంధువు ఇంట్లో ఏకంగా రూ. 28 కోట్ల నగదు, రూ. 21 కోట్ల విలువైన 15 కిలోల బంగారం బయటపడింది. బీర్భూమ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నోట్ల కట్టలను లెక్కించేందుకు పోలీసులు తీసుకొచ్చిన ఐదు కౌంటింగ్ మిషన్లు కూడా మొరాయించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే.. బీర్భూమ్‌కు చెందిన మినార్ మండల్ అనే బస్ డ్రైవర్ ఇంట్లో నిన్న రాత్రి పోలీసులు దాడులు ప్రారంభించారు. ఉదయానికి స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ. 28 కోట్లకు చేరింది. మినార్ మండల్.. టీఎంసీ మాజీ నేత అనుబ్రత మండల్‌కు సన్నిహితుడైన వ్యాపారి తులు మండల్‌కు బంధువు. ఇటీవల తులు మండల్, టీఎంసీ రెబల్ వర్గంలో చేరారు. పోలీసులు మినార్ మండల్‌ను అరెస్ట్ చేయగా, విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. పట్టుబడిన డబ్బు, బంగారం అంతా తులు మండల్, అతని 'అక్రమ సిండికేట్'కు చెందినదని అంగీకరించాడు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. ఇసుక మాఫియాపై ఇది తమ ప్రభుత్వ ఉక్కుపాదమని, అవినీతిపై జీరో-టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తామని ఆయన 'ఎక్స్' వేదికగా తెలిపారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ దాడులు నిర్వహించిన బీర్భూమ్ పోలీసులను ఆయన అభినందించారు.
టీఎంసీలో ముదిరిన వర్గపోరు
ఈ భారీ నగదు రికవరీ ఘటన తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకు దారితీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. "కొందరు నేతలు తమ అక్రమ సంపదను దాచుకోవడానికే 'మంచి తృణమూల్' నేతలుగా ముద్ర వేసుకుంటున్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరపాలి" అని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అన్నారు.
ఇదిలావుండగా, 2024లో తులు మండల్ తన కుమార్తెకు రూ. 100 కోట్లతో అత్యంత విలాసవంతంగా జరిపిన పెళ్లి వేడుక మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ వివాహానికి బాలీవుడ్, బెంగాలీ నటులు అర్బాజ్ ఖాన్, జరీన్ ఖాన్ వంటి వారు హాజరయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఈ భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
బెంగాల్‌లో టీఎంసీ నేత బంధువు ఇంట్లో భారీగా నగదు, బంగారం
