ఒక చిన్న భూభాగం.. కానీ ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చ. వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి అక్కడికి చేరేందుకు సముద్రంలో దూకుతున్నారు. కొందరు అలలను దాటుకుని గమ్యానికి చేరుతుంటే.. మరికొందరు అదే సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్పెయిన్ సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. గత 24 గంటల్లోనే 49 వేల మందికిపైగా స్యూటాలోకి ప్రవేశించినట్లు స్పెయిన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు స్యూటా ఎక్కడుంది? ఎందుకు వేలాది మంది అక్కడికి వెళుతున్నారు? ఒక్కసారిగా పరిస్థితి ఎందుకు మారింది? ఈ సంక్షోభం వెనుక కథేంటి?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.
స్యూటా ప్రత్యేకత ఏంటి?
ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో తీరానికి ఆనుకుని ఉన్న స్పెయిన్‌కు చెందిన చిన్న స్వయం ప్రతిపత్తి ప్రాంతమే స్యూటా. భౌగోళికంగా ఆఫ్రికాలో ఉన్నా.. రాజకీయంగా స్పెయిన్‌లో భాగం. అందువల్ల ఇది యూరోపియన్ యూనియన్ భూభాగమే. యూరప్‌లోకి వెళ్లాలనుకునే వలసదారులకు ఇది అత్యంత దగ్గరి మార్గం.
ఇప్పుడు ఏం జరిగింది?
ఈసారి పరిస్థితి గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా మారింది. ఒక్క రోజులోనే 49 వేల మందికిపైగా స్యూటాలోకి ప్రవేశించినట్లు స్పెయిన్ తెలిపింది. శరణార్థుల కేంద్రాలు నిండిపోయాయి. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేని స్థితి ఏర్పడింది. దీంతో సైన్యం, నౌకాదళం, వైమానిక దళాన్ని రంగంలోకి దించి సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రాణాలకు తెగించి మరీ..
స్యూటాకు చేరే మార్గం అత్యంత ప్రమాదకరం. మొరాకో తీరం నుంచి సముద్రంలో ఈదుకుంటూ సరిహద్దు దాటాల్సి వస్తుంది. బలమైన అలలు, సముద్ర ప్రవాహాలు, సరిహద్దు అడ్డంకులు ఈ ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఈసారి కూడా కనీసం 18 మంది మృతి చెందారు. ఎక్కువ మంది మునిగిపోయారు. మరెందరో నీటిలో చిక్కుకోగా సహాయక బృందాలు కాపాడాయి.
ఒక్కసారిగా ఎందుకు పెరిగింది?
తాజా సంక్షోభానికి ఒక కీలక పరిణామం కారణమైందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. సముద్ర మార్గంలో స్యూటా లేదా మెలిల్లాకు చేరిన వలసదారులను వెంటనే మొరాకోకు వెనక్కి పంపకూడదు. వారి పరిస్థితిని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దీంతో చట్టబద్ధంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తారనే వదంతులు వ్యాపించడంతో ఒక్కసారిగా వలసలు పెరిగాయి.
పాత వివాదమే మరో కారణమా?
స్యూటాపై స్పెయిన్, మొరాకో మధ్య వివాదం కొత్తది కాదు. 1580 నుంచి ఈ ప్రాంతం స్పెయిన్ అధీనంలో ఉంది. అయితే మొరాకో ఇప్పటికీ దీనిని తన భూభాగంగానే పరిగణిస్తోంది. 2021లో కూడా మొరాకో సరిహద్దు నియంత్రణలను సడలించడంతో రెండు రోజుల్లో సుమారు 8 వేల మంది స్యూటాలోకి ప్రవేశించారు. అప్పట్లో రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు కూడా నెలకొన్నాయి.
యూరప్‌కూ సవాల్
యూరోపియన్ యూనియన్‌కు స్యూటా భూసరిహద్దు. అందుకే అక్కడ జరిగే ప్రతి పరిణామం యూరప్ మొత్తంపై ప్రభావం చూపుతుంది. అక్రమ వలసలు పెరిగితే భద్రత, ఆశ్రయ విధానాలు, సరిహద్దు నిర్వహణపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఇటలీ కఠిన చర్యలు అవసరమని సూచించింది. మరోవైపు యూరోపియన్ యూనియన్ సరిహద్దు భద్రతా సంస్థ ఫ్రాంటెక్స్ కూడా సహకారం అందించేందుకు సిద్ధమైంది.
ముందున్న సవాళ్లు
సరిహద్దు వద్ద సైన్యాన్ని మోహరించడం తాత్కాలిక పరిష్కారమే. పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, యుద్ధాలు, మానవ అక్రమ రవాణా వంటి మూల సమస్యలు కొనసాగినంత కాలం వలసల ప్రవాహం ఆగడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
ఒక్క తీర్పు.. ఒక్కరోజులో 49 వేల మంది.. అసలు స్పెయిన్ పాలిత స్యూటాలో ఏం జరుగుతోంది?
