పిల్లలను జీవితంలో ఎలాంటి కష్టమూ రాకుండా కాపాడటం తల్లిదండ్రులకు సాధ్యం కాదు. కానీ ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలం, సరైన ఆలోచనా విధానం, జీవన నైపుణ్యాలను మాత్రం చిన్నప్పటి నుంచే నేర్పించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా నేర్పాల్సిన ఏడు ముఖ్యమైన జీవిత పాఠాలు ఇవే.
1. జీవితంలో అపజయాలు, తిరస్కరణలు సహజం. పిల్లలు ఓటమిని అంగీకరించి, దాని నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రయత్నించేలా ప్రోత్సహించాలి.
2. ఆత్మవిశ్వాసంతో పాటు సామర్థ్యం కూడా అవసరమని చెప్పండి. కేవలం ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోదు. నిరంతర సాధన, సరైన సన్నద్ధత ఉన్నప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసం వస్తుందని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి.
3. ప్రశ్నించే అలవాటు పెంచండి. సోషల్ మీడియా కాలంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. ఏది విన్నా, చూసినా వెంటనే నమ్మకుండా ‘దీనికి ఆధారం ఏంటి?’ అని ప్రశ్నించే అలవాటు పిల్లల్లో పెంచాలి.
4. భావోద్వేగాలను నియంత్రించడం నేర్పించండి. కోపం, భయం, నిరాశ వంటి భావాలు సహజం. కానీ వాటికి వెంటనే స్పందించకుండా.. కాస్త ఆలోచించి స్పందించే అలవాటు చాలా అవసరం.
5. డబ్బు విలువ తెలియజేయండి. చిన్న వయసు నుంచే పొదుపు, బడ్జెట్, అవసరం-కోరికల మధ్య తేడా వంటి ఆర్థిక విషయాలను పిల్లలకు వివరించాలి.
6. ఎవరూ గుర్తించకపోయినా కష్టపడే తత్వం అలవాటు చేయండి. ప్రశంసల కోసం కాకుండా బాధ్యతతో, క్రమశిక్షణతో పని చేయడం విజయానికి కీలకమని నేర్పాలి.
7. ఇతరులతో పోల్చుకోవద్దని చెప్పండి. ఇతరులతో పోల్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నిన్నటి తమతోనే ఈరోజు పోల్చుకుని ముందుకు సాగాలని పిల్లలను ప్రోత్సహించాలి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలకు సమస్యలు రాకుండా చేయడం కంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం, నైపుణ్యాలు నేర్పించడమే తల్లిదండ్రులు ఇవ్వగలిగే గొప్ప బహుమతి.
భవిష్యత్తులో బలంగా నిలబడాలంటే.. పిల్లలకు చిన్నప్పుడే నేర్పాల్సిన 7 జీవిత పాఠాలు..
