వివో భారత మార్కెట్లో వివో టీ5 లైట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌ టీ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ జులై 22 నుంచి విక్రయాలకు అందుబాటులోకి రానుంది. ట్విలైట్‌ షాడో, వేవ్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌, వివో ఆన్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.

వివో టీ5 లైట్‌ 5జీ ప్రారంభ ధర రూ.19,999గా నిర్ణయించారు. 4జీబీ+128జీబీ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. 6జీబీ+128జీబీ మోడల్‌ ధర రూ.21,999 కాగా, 6జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.24,999కు అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. మూడు నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌రేట్‌, 1,200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో గరిష్ఠంగా 6జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్‌ ర్యామ్‌, 256జీబీ యూఎఫ్‌ఎస్‌ 2.2 స్టోరేజ్‌ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌ సోనీ ఐఎంఎక్స్‌852 ప్రధాన కెమెరాతో పాటు మరో సెకండరీ సెన్సార్‌ను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు 5 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది. 6,500ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ 44 వాట్ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్‌బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సీ కనెక్టివిటీతో పాటు ఐపీ65 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ను కూడా ఇందులో అందించారు.