వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత 10 గంటలుగా అటవీ ప్రాంతంలో వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరి జలపాతం ఉగ్రరూపం దాల్చింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఉన్న బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
వరద ఉద్ధృతికి రాళ్లు జారే ప్రమాదం ఉండటంతో పాటు ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశమున్నందున పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జలపాత పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు తెలిపారు. వరద తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పర్యాటకులు పోలీసులు, అటవీ శాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు.
