భోగాపురం విమానాశ్రయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దొంగ దారులు వెతుకుతున్నారని, కిరీటం వేసుకోవడంలో ఆయన చూపే శ్రద్ధ అభివృద్ధిలో చూపరని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా వేదికగా జగన్ స్పందిస్తూ... "2019 ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ఒక శంకుస్థాపన రాయి వేసి ముచ్చట తీర్చుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. కానీ 2020లో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం నుంచి భూసేకరణ, భద్రతా అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వరకు ప్రతీదీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి" అని స్పష్టం చేశారు.
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు నీరు, విద్యుత్, రోడ్ల కనెక్టివిటీ కోసం తమ ప్రభుత్వం ఏకంగా రూ.1200 కోట్లు ఖర్చు చేసిందని జగన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం ఎదురైనా రన్‌వే, టెర్మినల్ పనులను వేగవంతం చేసి 2026 నాటికే విమానాల రాకపోకలు మొదలవుతాయని అప్పుడే ప్రకటించామని చెప్పారు. తాము పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలాలు అందుతుంటే... ఏమీ చేయని చంద్రబాబు దొంగ క్రెడిట్ కొట్టేసేందుకు శాయశక్తులా తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు.
