రాయలసీమను పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ రేపు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ రూ.5,350 కోట్లు కావడం గమనార్హం.

రాష్ట్రానికి వస్తున్న భారీ పరిశ్రమలకు నిరంతరాయంగా, నాణ్యమైన పునరుత్పాదక ఇంధనాన్ని అందించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ప్రకటించిన 'ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024'కు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. రాష్ట్రంలోని యుటిలిటీలు, డిస్కమ్‌లు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో ఈ ప్లాంట్లు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో 2,700 ఎకరాల్లో రూ.2,250 కోట్ల వ్యయంతో 400 మెగావాట్ల సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా కనేకల్లులో 760 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అనంతపురంలోని విండ్ ప్రాజెక్టును సుజ్లాన్ సంస్థ సాంకేతిక సహకారంతో టాటా పవర్ అభివృద్ధి చేయనుంది.

ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన 1,100కు పైగా రైతు కుటుంబాలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం లభించనుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు సమర్థవంతంగా తరలించేందుకు ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ఐఎస్‌టీఎస్‌) కనెక్టివిటీని కూడా సాధించారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు.