విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడి ఆచూకీ కోసం దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను, తన అంగీకారం లేకుండానే ఉపసంహరించుకోవడానికి గతంలో పనిచేసిన న్యాయవాది ప్రయత్నించారని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు అనుమతి కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.

విజయలక్ష్మి చేసిన ఆరోపణలను జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై పాత న్యాయవాది వాదనలను కూడా వినాల్సి ఉందని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ విజయలక్ష్మి మరో న్యాయవాది ద్వారా ఇప్పటికే అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడైన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించే వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది.

సిట్ తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులకు గాను ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశామని, కీలకమైన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అయితే, సాయికృష్ణ మృతదేహాన్ని ఇంకా కనుగొనాల్సి ఉందని ధర్మాసనానికి నివేదించారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.