తెలంగాణలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే దిశగా టీజీఎస్ఆర్టీసీ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణికులకు ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు, బస్సు దిగాక గమ్యస్థానం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని కొనసాగించేందుకు 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్' కనెక్టివిటీ విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటో తయారీ కంపెనీలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు కొలిక్కి వచ్చిన వెంటనే ఈ-ఆటోలు రోడ్డెక్కనున్నాయి.
ఈ కొత్త విధానంలో ప్రయాణికులు తమ బస్ టికెట్‌ను బుక్ చేసుకునే సమయంలోనే అదనంగా ఆటో రైడ్‌ను కూడా ఒకేసారి బుక్ చేసుకునేలా ప్రత్యేక సౌకర్యం కల్పించనున్నారు. దీని ద్వారా ప్రయాణికులను వారి నివాసం నుంచి సమీప బస్ పాయింట్‌కు, అలాగే బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి వారి చివరి గమ్యస్థానానికి ఈ-ఆటోలు సురక్షితంగా చేరవేస్తాయి. ఫలితంగా ప్రయాణికులకు విలువైన సమయం ఆదా అవడంతో పాటు బస్టాప్‌లకు చేరుకోవడానికి, అక్కడి నుంచి గమ్యస్థానాలకు వెళ్లడానికి పడే ప్రయాసలు తప్పుతాయి.
ఈ ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రయోగాత్మకంగా తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ లభించే స్పందన, ఫలితాల ఆధారంగా రెండో దశలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు దశలవారీగా విస్తరించాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నగరంలో అధిక ఛార్జీలతో నడుస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ రైడ్ హెయిలింగ్ యాప్‌ల కన్నా గణనీయంగా తక్కువ ఛార్జీలతో ఈ సేవలను అందించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్‌చెరు, శంషాబాద్, ఘట్‌కేసర్ వంటి కనెక్టివిటీ సమస్యలున్న ప్రాంతాల ప్రజలకు గొప్ప ఊరట లభించనుంది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆర్టీసీ ఈ-ఆటోల నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రయాణికుల కోసం 'ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్' కనెక్టివిటీకి ఆర్టీసీ శ్రీకారం..
