ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తానొక ఆప్త మిత్రుణ్ని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్‌ అండగా ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెద్దిని కాపాడేందుకు పార్టీ చేసిన ప్రయత్నాలు, వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ పరిణామం తనకు తీవ్ర మనోవేదన కలిగించిందని పేర్కొన్నారు.

తెలంగాణనే శ్వాసగా భావించి నీతి, నిజాయతీతో ప్రజా జీవితాన్ని కొనసాగించిన నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అని కేసీఆర్‌ కొనియాడారు. పోరాటాల గడ్డ ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్‌ జెండాను ఎగురవేసిన ధీరుడని చెప్పారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలోనే ఆయన రాజకీయ ప్రస్థానం సాగిందని గుర్తు చేశారు.

ఉద్యమంలోనూ, నియోజకవర్గ అభివృద్ధిలోనూ పెద్ది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కేసీఆర్‌ అన్నారు. పార్టీపట్ల అత్యంత విధేయతతో పనిచేసిన నాయకుడిగా ఆయన్ను అభివర్ణించారు. సుదర్శన్‌రెడ్డి మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.