ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారత్‌లో ‘ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌’ సేవను ప్రారంభించింది. కొనుగోలుదారులకు మరింత సౌకర్యవంతమైన క్రెడిట్‌ సదుపాయం కల్పించడమే దీని లక్ష్యమని తెలిపింది. ఈ సేవ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. పేయూ ఫైనాన్స్‌తో కలిసి ఈ సేవను తీసుకొచ్చింది.

ఈ సర్వీస్‌లో మూడు చెల్లింపు ఆప్షన్లు ఉన్నాయి. ‘పే లేటర్‌’ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులకు 30 రోజుల తర్వాత చెల్లించొచ్చు. ‘పే ఇన్‌ 3’ ఆప్షన్‌లో బిల్లును మూడు విడతలుగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఖరీదైన ఉత్పత్తులకు 3 నుంచి 12 నెలల ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, ఫర్నీచర్‌తో పాటు తక్కువ ధర ఉత్పత్తుల కొనుగోళ్లకూ ఈఎంఐ వర్తిస్తుంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌, వాలెట్లు, ఈఎంఐ, క్యాష్‌ ఆన్‌ డెలివరీ వంటి చెల్లింపు విధానాలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు వాటికి అదనంగా ‘ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు మరింత వెసులుబాటు కలగనుంది.

ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ ఫ్రీడమ్‌ సేల్‌కు ముందు కొత్త సర్వీస్‌ను ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌, ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ సభ్యులకు ఆగస్టు 7 నుంచే సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపు కూడా లభిస్తుందని కంపెనీ వెల్లడించింది..