ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ఆ తర్వాత తన సొంత ఇమేజ్‌తోనే గెలిచానని భ్రమపడటం వల్లే ఓటమి చవిచూశారని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, రాజకీయం బతికున్నంత కాలం వైఎస్సార్ పేరు నిలిచి ఉంటుందని కొనియాడారు. విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల క్రెడిట్ మొత్తం వైఎస్సార్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌కు కక్షసాధింపు రాజకీయాలు తెలియవని, చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులను ఆయన ఆపకుండా పూర్తి చేశారని తమ్మారెడ్డి గుర్తుచేశారు. అయితే, గత పదేళ్లుగా జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కక్షపూరిత రాజకీయాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. హైదరాబాద్ విజన్ చంద్రబాబుదే అయినా, ఆ అభివృద్ధిని వైఎస్సార్, కేసీఆర్, రేవంత్ రెడ్డి కొనసాగించారని, ఒక్కరే అభివృద్ధి చేశారనడం సరికాదని అభిప్రాయపడ్డారు.

రాజధాని అమరావతి నిర్మాణంపై మాట్లాడుతూ.. పంట పొలాల్లో కాకుండా బీడు భూముల్లో రాజధాని నిర్మించి ఉంటే పనులు వేగంగా జరిగేవని అన్నారు. అమరావతిని 'కమ్మరావతి' అనడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వం "మావిగన్" (మచిలీపట్నం-విజయనగరం-గుంటూరు) పేరుతో పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. ఇప్పటికే నిర్ణయించిన అమరావతిని కొనసాగిస్తూ, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలను అభివృద్ధి చేస్తే బాగుండేదని హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ మోడల్‌కు ఇవ్వడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.

సినీ నటుల రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ, చిరంజీవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో సొంతంగా నిర్ణయాలు తీసుకున్న చిరంజీవి, ఆ తర్వాత చెప్పుడు మాటలు విని రాజకీయంగా నిలబడలేకపోయారని విశ్లేషించారు. సరిగ్గా రాజకీయం చేసి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు. ఇక, జనసేనలో గెలిచిన ఎమ్మెల్యేలలో 50% టీడీపీ నుంచి వచ్చిన వారేనని తాను మీడియాలో చూశానని, పొత్తులో భాగంగా ఇలా టికెట్లు ఇచ్చుకుంటే ఇక పొత్తుకు అర్థమేంటని ఆయన ప్రశ్నించారు.