భారత్‌లో చైనీస్ ఫుడ్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది చికెన్ మంచూరియా. రెస్టారెంట్లు, వీధి బండ్ల వద్ద అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ వంటకం చైనాకు చెందిందని అందరూ భావిస్తారు. కానీ, ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే.. ఈ వంటకానికి చైనా దేశానికి గానీ, అక్కడి మంచూరియా ప్రాంతానికి గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది అచ్చంగా మన దేశంలో, మన ముంబైలో పుట్టిన ఒక దేశీ ఆవిష్కరణ.

ఈ కథ 1970వ దశకంలో ముంబైలో ప్రారంభమైంది. కోల్‌కతాలో పుట్టి, ముంబైలో స్థిరపడిన మూడో తరం చైనీస్-ఇండియన్ చెఫ్ నెల్సన్ వాంగ్, అప్పట్లో ముంబైలోని ప్రతిష్ఠాత్మక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో పనిచేసేవారు. ఒకరోజు ఒక కస్టమర్ వచ్చి, మెనూలో ఉన్నవి కాకుండా ఏదైనా కొత్తగా, విభిన్నంగా చేసి పెట్టమని అడిగారు. ఆ సమయంలో నెల్సన్ వాంగ్ ఒక ప్రయోగం చేశారు. కోడి మాంసం ముక్కలను బాగా వేయించి (డీప్-ఫ్రై), దానికి సోయా సాస్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కార్న్‌స్టార్చ్‌తో చేసిన ఘాటైన, పుల్లని సాస్‌ను జోడించి వడ్డించారు. ఆ కొత్త వంటకానికి కస్టమర్ ఫిదా అయ్యారు. అలా అనుకోకుండా పుట్టిందే చికెన్ మంచూరియా.

కొద్దికాలంలోనే ఈ వంటకం కీర్తి క్లబ్ దాటి దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఆ తర్వాత నెల్సన్ వాంగ్ ముంబైలో 'చైనా గార్డెన్' పేరుతో సొంత రెస్టారెంట్‌ను ప్రారంభించి, ఈ వంటకాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. అనతికాలంలోనే ‘మంచూరియా’ అనేది ఒక ప్రదేశం పేరుగా కాకుండా, ఒక ప్రత్యేకమైన వంట శైలిగా (style of cooking) మారిపోయింది. చికెన్‌తో పాటు గోబీ మంచూరియా, పనీర్, బేబీ కార్న్, రొయ్యల మంచూరియా వంటి ఎన్నో రకాలు పుట్టుకొచ్చాయి.

ఆహార నిపుణుల ప్రకారం.. చైనీస్ వంట పద్ధతులను భారతీయ రుచులకు అనుగుణంగా మార్చే 'ఇండో-చైనీస్' లేదా 'చిండియన్' వంటకాలకు మంచూరియా ఒక చక్కటి ఉదాహరణ. పేరు విదేశీది అయినా, దాని ఆత్మ, రుచి పూర్తిగా భారతీయమైనవి. నేడు వీధి బండ్ల నుంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ల వరకు ఫ్రైడ్ రైస్, హక్కా నూడుల్స్‌తో పాటు తప్పనిసరిగా కనిపించే మంచూరియా, మన దేశంలో జరిగిన ఒక అద్భుతమైన పాకశాస్త్ర ఆవిష్కరణకు నిలువెత్తు నిదర్శనం.