ట్రంప్ ప్రభుత్వ కొత్త ప్రజా దౌత్య వ్యూహంలో భారత్‌కు కీలక స్థానం దక్కింది. ఆసియాపై మరింత దృష్టి సారిస్తూ విదేశాల్లో సమాచార వ్యాప్తి విధానాన్ని మార్చేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత్, జపాన్ వంటి దేశాలకు ప్రాధాన్యం పెంచనున్నట్లు అమెరికా గ్లోబల్ మీడియా ఏజెన్సీ (యూఎస్‌ఏజీఎం) డైరెక్టర్ పదవికి నామినేట్ అయిన సారా రోజర్స్ వెల్లడించారు.
అమెరికా సెనేట్ విదేశాంగ వ్యవహారాల కమిటీ ముందు మాట్లాడిన రోజర్స్.. ఆసియా తమ ప్రాధాన్య ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుందని చెప్పారు. చైనా, ఇతర నిరంకుశ దేశాల దుష్ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం అవసరమని అభిప్రాయపడ్డారు. వాయిస్ ఆఫ్ అమెరికా, రేడియో ఫ్రీ ఆసియా, రేడియో ఫ్రీ యూరప్ వంటి అంతర్జాతీయ ప్రసార సంస్థలను యూఎస్‌ఏజీఎం నిర్వహిస్తోంది.
భారత్, జపాన్‌లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఆ దేశాలపై తాను ఎక్కువగా దృష్టి పెట్టినట్లు రోజర్స్ తెలిపారు. ఈ దేశాలకు సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసినట్లు చెప్పారు. సంప్రదాయ రేడియో, టెలివిజన్‌కే పరిమితం కాకుండా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే డిజిటల్ వేదికలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
భవిష్యత్తులో షార్ట్ వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు, ప్రవాస భారతీయుల గ్రూప్ చాట్‌లు కూడా సమాచార వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తాయని రోజర్స్ పేర్కొన్నారు. స్వతంత్ర సమాచారం అందుబాటులో లేని దేశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. చైనాతో వాణిజ్యం, సాంకేతిక రంగం, రక్షణతో పాటు సమాచార రంగంలోనూ పోటీ పెరుగుతున్న వేళ ఈ మార్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌పై ట్రంప్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి.. కొత్త దౌత్య వ్యూహం సిద్ధం..
