అంతరిక్షంలో ప్రయోగాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వ్యర్థాల సమస్య కూడా తీవ్రమవుతోంది. తాజాగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఓ రాకెట్ పైదశ నియంత్రణ కోల్పోయి చంద్రుడిని ఢీకొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయోగం కాదు. అయినా ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన వల్ల చంద్రుడిపై ఏర్పడే గుంత, ఎగిసే ధూళిని పరిశీలించి విలువైన సమాచారం సేకరించాలని భావిస్తున్నారు.
2025 జనవరి 15న రెండు ప్రైవేటు చంద్రయాన ల్యాండర్లను స్పేస్‌ఎక్స్ రాకెట్ తీసుకెళ్లింది. పని పూర్తయ్యాక దాని పైదశ అంతరిక్షంలోనే తేలియాడుతూ ఉంది. కక్ష్యను మార్చే అవకాశం లేకపోవడంతో అది ఇప్పుడు చంద్రుడివైపు దూసుకెళ్తోంది. బుధవారం చంద్రుడి పశ్చిమ అంచున ఉన్న ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటుందని అంతరిక్ష ట్రాకింగ్ నిపుణుడు బిల్ గ్రే అంచనా వేశారు. ఇది శబ్ద వేగం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.
ఈ ఢీకొట్టడం వల్ల దాదాపు 27 మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల లోతుతో కొత్త గుంత ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభావం క్షణాల్లో ముగిసినా, ధూళి, రాళ్ల శకలాలు చాలా కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరే అవకాశముంది. చంద్రుడిపై గాలి లేకపోవడం, గురుత్వాకర్షణ తక్కువగా ఉండడం వల్ల ఆ ధూళి కొంతసేపు అంతరిక్షంలోనే కనిపించొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ దృశ్యాలను భూమిపై ఉన్న టెలిస్కోపులతో పాటు కక్ష్యలోని వ్యోమనౌకలు కూడా చిత్రీకరించనున్నాయి.
ఈ ఘటనతో శాస్త్రవేత్తలకు మరో కీలక అవకాశం లభించనుంది. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ స్థావరాలు ఏర్పడినప్పుడు ఇలాంటి అంతరిక్ష వ్యర్థాలు ఎంతటి ప్రమాదం కలిగిస్తాయో అంచనా వేసేందుకు ఈ ఘటన ఉపయోగపడనుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లూనార్ రీకనైసెన్స్ ఆర్బిటర్‌తో పాటు దక్షిణ కొరియా డనూరి ఆర్బిటర్ కూడా ప్రమాదానికి ముందు, తర్వాత ఆ ప్రాంతాన్ని చిత్రీకరించనున్నాయి.
ఇది చంద్రుడిని అనుకోకుండా ఢీకొట్టనున్న రెండో రాకెట్‌గా గుర్తింపు పొందుతోంది. 2022లో చైనా రాకెట్‌కు చెందిన ఓ భాగం చంద్రుడి అవతలి వైపు పడింది. ప్రస్తుతం అమెరికా, చైనా చంద్రుడిపై వ్యోమగాములను దింపే లక్ష్యంతో పోటీపడుతున్న వేళ అంతరిక్ష వ్యర్థాల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ..
