ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయారు. ఈ నేపథ్యంలో, మంత్రి సీతక్క స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు. భద్రాచలం ఎగువన ఉన్న మంగపేట మండల కేంద్రానికి ఈ ఉదయం చేరుకున్న ఆమె... గోదావరి ఉద్ధృతిని, కరకట్ట పనుల పురోగతిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలు ఏ మేరకు ముంపునకు గురయ్యాయనే వివరాలను రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఐబీ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పొద్మూరు, ముస్లిం వాడ, బీసీ కాలనీ పరిధిలోని ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి సందర్శించారు. నిర్వాసితులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన, వసతి సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
గోదావరి ఉద్ధృతి తగ్గేవరకు అధికారులు ఎవరూ హెడ్‌క్వార్టర్స్ వదలి వెళ్లకుండా నిరంతరం అందుబాటులోనే ఉండాలని, నిర్వాసితులకు అవసరమైన సహాయక చర్యలు త్వరితగతిన అందించాలని సీతక్క ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న లోతట్టు ముంపు పరిస్థితులపై తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై టీవీఆర్ సూరి, ఎంపీడీవో భద్రులు మంత్రికి నివేదించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, సీనియర్ నాయకులు మైల జయరాంరెడ్డి, వెంకట్ రెడ్డి, భగవాన్ రెడ్డి, మల్లయ్య, పెద్ది నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
