భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం వంటిదని, దీని ద్వారా ఈ ప్రాంత ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ఆయన అభివర్ణించారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశాం. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నాం. ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌బస్సు వచ్చింది. గతంలో ఉత్తరాంధ్రను అవహేళన చేసిన వారు ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయారు" అని పరోక్షంగా విమర్శలు చేశారు. అనేక అడ్డంకులను అధిగమించి అద్భుతమైన విమానాశ్రయాన్ని నిర్మించుకోవడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర శక్తికి ఈ ఎయిర్‌పోర్టు నిదర్శనమని సీఎం అన్నారు. "ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జీఎమ్మాఆర్ ఉత్తరాంధ్ర వాసి కావడం, దీనికి తొలి అడుగు వేసిన అశోక్‌గజపతిరాజు, నిర్మాణం పూర్తిచేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్‌ నాయుడు కూడా ఇక్కడి వారే కావడం విశేషం" అని చంద్రబాబు వివరించారు. గూగుల్‌, స్టీల్‌ కంపెనీ వంటి అనేక సంస్థలు కూడా ఉత్తరాంధ్రకు వస్తున్నాయని ఆయన తెలిపారు.