దేశ భద్రత, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో తిరుగులేని సేవలు అందించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను 'లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు' వరించింది. మహారాష్ట్రలోని పుణేలో ఈరోజు బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అజిత్ దోవల్‌కు అందజేశారు.

 

ఈ వేడుకలో లోక్‌మాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్ నాథ్ షిండే, సునేత్ర పవార్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అవార్డు కింద ఒక జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు రూ. 1 లక్ష నగదు బహుమతిని అందజేశారు.

 

దేశ భద్రత, దౌత్యం, ఇంటెలిజెన్స్ రంగాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న అజిత్ దోవల్ (81) భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. 'ఆపరేషన్ బ్లాక్ థండర్', డోక్లామ్ వివాదంలో వ్యూహాత్మక దౌత్య చర్చలు, బాలాకోట్ వైమానిక దాడుల రూపకల్పనలో ఆయన పాత్ర అత్యంత ప్రశంసనీయం.


1968 కేరళ కేడర్‌కు చెందిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి, మూడు దశాబ్దాలకు పైగా భారత ఇంటెలిజెన్స్‌లో పనిచేసి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా సేవలు అందించారు. మిజోరం, సిక్కిం, పంజాబ్, జమ్మూకశ్మీర్ వంటి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు ఇస్లామాబాద్, లండన్‌లలో భారత దౌత్య కార్యాలయాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తమ రంగాల్లో సేవలు అందిస్తూ భారత్‌ను అత్యున్నత స్థాయిలో నిలిపిన ప్రముఖులకు ప్రతి ఏటా ఈ లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రధానం చేస్తున్నారు.