నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో (ఎన్‌ఎస్‌టీఆర్) ఆడపులి మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పర్యావరణ-అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, ప్రకృతి సమతుల్యతకు పులుల సంరక్షణ అత్యంత కీలకమని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఒక్క పులి ప్రాణం కోల్పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని, మన అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన గుర్తు చేస్తోందని అన్నారు.

ఈ మృతి వెనుక ఉన్న కారణాలను నిగ్గు తేల్చేందుకు సమగ్రంగా, పారదర్శకంగా విచారణ జరపాలని ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించినట్లు పవన్ తెలిపారు. "ఇది సహజ మరణమా? లేక వేట, విష ప్రయోగం వంటి మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి అసలు కారణాలు తెలుసుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను వెంటనే పెంచాలని, క్షేత్రస్థాయిలో నిఘాను పటిష్ఠం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటనలో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందని తేలితే కఠినమైన చర్యలు తప్పవని, అటవీ, వన్యప్రాణి సంరక్షణకు సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హెచ్చరించారు.

నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం తొమ్మిదేళ్ల ఆడపులి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆత్మకూరు, నాగలూటి ఫారెస్ట్ రేంజ్‌ల సరిహద్దులోని ఇసుక మడుగు వద్ద గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది పులి మృతదేహాన్ని గుర్తించారు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నిబంధనల ప్రకారం గురువారం పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. పులి శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అధికారులు ప్రాథమికంగా తెలిపారు.