మానవ భవిష్యత్తు, అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చైనా ఒక కీలక ముందడుగు వేసింది. తొలిసారిగా మానవ కృత్రిమ పిండాలను అంతరిక్షంలోకి పంపి, వాటి అభివృద్ధిపై ఒక సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మే 10న లాంగ్ మార్చ్ 7 రాకెట్ ద్వారా ప్రయోగించిన తియాన్‌జౌ-10 మిషన్, ఈ కృత్రిమ పిండాలను తియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌కు విజయవంతంగా చేర్చింది.

అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ) వాతావరణంలో ఈ పిండాల నమూనాలు సుమారు 5 రోజుల పాటు అభివృద్ధి చెందాయి. అనంతరం, తదుపరి విశ్లేషణ కోసం వాటిని ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచారు. ఇదే సమయంలో భూమిపై కూడా కొన్ని నమూనాలను పెంచి, అంతరిక్షంలోని వాటితో పోల్చి చూడనున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా జెబ్రాఫిష్, ఎలుకల పిండాలను కూడా పంపారు.

అయితే, ఇవి నిజమైన మానవ పిండాలు కావని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు స్పష్టం చేశారు. మానవ మూల కణాల నుంచి ప్రయోగశాలలో సృష్టించిన ఈ నమూనాలు, పిండం అభివృద్ధిలోని తొలి దశలను (సుమారు 14-21 రోజులు) మాత్రమే పోలి ఉంటాయని, ఇవి శిశువుగా మారే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

అంతరిక్షంలో ఉండే తీవ్రమైన రేడియేషన్, గురుత్వాకర్షణ లేకపోవడం వంటి పరిస్థితులు మానవ పునరుత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మానవ కాలనీలు ఏర్పాటు చేయాలన్నా, సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాలన్నా ఈ తరహా పరిశోధనలు అత్యంత కీలకం కానున్నాయి. ఈ ప్రయోగం ఫలితాలు, అంతరిక్షంలో మానవ మనుగడకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.