ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఇజ్రాయెల్‌ మీడియా సంచలన కథనాలు ప్రచురించింది. త్వరలోనే ఆయన మరణవార్త వినాల్సి రావచ్చంటూ ఇరాన్‌ అధికార వర్గాలకు చెందిన వ్యక్తులు పేర్కొన్నట్లు మరో కథనం వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఇరాన్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్‌ 14.. ఇరాన్‌లోని తమ వర్గాలను ఉటంకిస్తూ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో ఇరాన్‌వైర్‌ కూడా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ఆయన ఆరోగ్యంపై కీలక వివరాలను వెల్లడించింది.

ఇరాన్‌వైర్‌ కథనం ప్రకారం.. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడి తర్వాత మంత్రివర్గ సభ్యులను ఇప్పటి వరకు మొజ్తబా ప్రత్యక్షంగా కలవలేదని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉందన్న ప్రచారం ఇరాన్‌ అత్యున్నత నాయకత్వ వర్గాల్లో జరుగుతోందని ఆ కథనం పేర్కొంది.

పెజెష్కియాన్‌ మంత్రివర్గానికి సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి.. మొజ్తబా శారీరక పరిస్థితి బాగోలేదని, ఆయన మరణవార్త వినాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించినట్లు ఇరాన్‌వైర్‌ తెలిపింది.

మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. ప్రసంగాలు కూడా చేయలేదు. ఆయన పేరుతో ఇరాన్‌ అధికారిక మీడియా కేవలం లిఖితపూర్వక ప్రకటనలను మాత్రమే విడుదల చేస్తోంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇరాన్‌ అధికారులు మాత్రం గతంలో ఈ వార్తలను ఖండించారు. ఫిబ్రవరి దాడుల్లో మొజ్తబాకు తీవ్ర గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇటీవల అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కూడా సుప్రీం లీడర్‌తో ప్రస్తుతం కమ్యూనికేషన్‌ కష్టంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆయనే ప్రధాన బలమని పేర్కొన్నారు.