పాలు శాకాహారమా? లేక మాంసాహారమా? ఇది చాలామందిలో తరచూ తలెత్తే ఒక సాధారణ సందేహం. ముఖ్యంగా ఆహార నియమాలపై కచ్చితంగా ఉండే వారిలో ఈ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే, భారతదేశంలో పాలను సంప్రదాయబద్ధంగా, అధికారికంగా శాకాహారంగానే పరిగణిస్తారు. అందుకే దేశంలో విక్రయించే అన్ని పాల ప్యాకెట్లపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనల ప్రకారం ఆకుపచ్చ రంగు 'వెజిటేరియన్' గుర్తు ఉంటుంది.
మాంసం, చేపలు, గుడ్లు వంటివి తినకుండా, కేవలం పాల ఉత్పత్తులను తీసుకునే వారిని 'లాక్టో-వెజిటేరియన్లు' అంటారు. జంతువులను వధించకుండా, వాటి నుంచి సహజంగా లభించే ఉత్పత్తి కాబట్టి పాలను శాకాహారంగా పరిగణిస్తారు. ఆవులు, గేదెలు, మేకలు వంటివి గడ్డి, ఎండుగడ్డి, ధాన్యాలు, తవుడు వంటి మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుని, వాటిని తమ శరీరంలో పోషకాలుగా మార్చుకుని పాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో జంతువుకు ఎలాంటి హాని జరగదు. అందువల్ల, పాలను మాంసాహారంగా వర్గీకరించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయితే, కొన్ని విదేశీ దేశాల్లో ఈ విషయంపై అప్పుడప్పుడు వాదనలు తెరపైకి వస్తుంటాయి. అక్కడి కొన్ని పశుపోషణ కేంద్రాల్లో జంతువులకు ఇచ్చే దానాలో చేపల పొడి లేదా ఇతర జంతు సంబంధిత ఉత్పత్తుల మిశ్రమాలను కలుపుతారు. ఇలాంటి ఆహారం తీసుకున్న జంతువుల నుంచి వచ్చే పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలనేది కొందరి వాదన. కానీ, ఈ వాదనతో భారతీయ ఆహార ప్రమాణాలు, నిబంధనలు ఏకీభవించడం లేదు. పశువులు తీసుకునే ఆహారం ఆధారంగా పాలను వర్గీకరించలేమని, పాలు ఎప్పటికీ శాకాహారమేనని స్పష్టం చేస్తున్నాయి.
ఇక, శాకాహారానికి, వేగనిజానికి మధ్య ఉన్న తేడాను కూడా ఇక్కడ గమనించాలి. వేగన్లు పాలు, పెరుగు, నెయ్యి, తేనె వంటి జంతువుల నుంచి లభించే ఏ ఉత్పత్తిని ఉపయోగించరు. ఇది వారి నైతిక విలువలపై ఆధారపడి ఉంటుంది. కానీ, భారతీయ ఆహార సంస్కృతి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలు సంపూర్ణ శాకాహారమే. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.
పాల ప్యాకెట్లపై గ్రీన్ సింబల్ ఎందుకు ఉంటుంది?.. ఇది వెజ్జా, నాన్-వెజ్జా?
