భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఒక వింగ్ కమాండర్ హనీట్రాప్‌లో చిక్కుకుని, కీలకమైన రక్షణ రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఐఏఎఫ్ నిఘా విభాగం అందించిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు మే నెలాఖరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయగా, ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం.. సదరు అధికారిని సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయం, వర్గీకృత సమాచారం, పత్రాలను పంపే వరకు దారితీసిందని భావిస్తున్నారు. వ్యూహాత్మక సైనిక రహస్యాలను సేకరించేందుకు జరుగుతున్న గూఢచర్యంలో భాగంగానే ఇది జరిగిందని, దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల హస్తం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

సివిల్ అధికారులకు అప్పగించడానికి ముందు ఐఏఎఫ్ నిఘా విభాగం ఆ అధికారిపై కొంతకాలం నిఘా పెట్టింది. ఈ కేసులో జులై ఆరంభంలోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎంత మేరకు సమాచారం లీక్ అయింది, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ జరుగుతున్నందున మరిన్ని వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.