యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడతాయంటూ జరుగుతున్న చర్చకు ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్‌ తెరదించారు. సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా డబ్బు పంపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘భారతీయ వినియోగదారులందరికీ యూపీఐ ఉచితంగానే ఉంటుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

లోక్‌సభలో కొత్త పన్ను సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధించే అంశంపై చర్చ మొదలైంది. దీంతో యూపీఐ వాడితే సామాన్యుల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఎండీఆర్‌ ఉంటే అది వ్యాపార సంస్థల పరిధిలోనే ఉంటుందని పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) తెలిపింది. చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించేందుకు ఎలాంటి ఎండీఆర్‌ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఎండీఆర్‌ అంటే?
డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు పేమెంట్‌ సేవల సంస్థలకు చెల్లించే రుసుమునే ఎండీఆర్‌ అంటారు. కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000కు మించిన కొన్ని వ్యాపార సంబంధిత ఎలక్ట్రానిక్‌ చెల్లింపులపై 0.25 శాతం నుంచి 0.4 శాతం వరకు ఎండీఆర్‌ విధించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఒకరి నుంచి మరొకరికి చేసే యూపీఐ చెల్లింపులకు ఇది వర్తించదు.

కొత్త బిల్లు యూపీఐ వినియోగదారులపై నేరుగా ఛార్జీలు విధించడం లేదని పీసీఐ స్పష్టం చేసింది. దాదాపు పదేళ్లుగా బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు, ఎన్‌పీసీఐ, ఆర్‌బీఐ కలిసి యూపీఐ వ్యవస్థ నిర్వహణ, సైబర్‌ భద్రత, మోసాల నివారణ వంటి ఖర్చులను భరిస్తున్నాయి. ఇకపై ఈ వ్యవస్థకు స్థిరమైన ఆర్థిక నమూనాపై చర్చ జరుగుతోంది.