భారత డేటా సెంటర్ల మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తూ గ్లోబల్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో కీలక స్థానానికి చేరుకుంటోంది. ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలోనే రెండో అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్‌గా భారత్ నిలిచింది. ప్రస్తుతం దేశంలో 1.6 గిగావాట్ల కార్యాచరణ సామర్థ్యం ఉండగా.. మరో 3.1 గిగావాట్ల సామర్థ్యం నిర్మాణం, ప్రణాళిక దశల్లో ఉంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్‌ అండ్ వేక్‌ఫీల్డ్‌ నేడు విడుదల చేసిన తాజా నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం, హైపర్‌స్కేల్ క్లౌడ్ విస్తరణ, సంస్థల నుంచి డిమాండ్ అధికమవ్వడం వంటి కారణాలతో భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలక కేంద్రంగా మారుతోందని నివేదిక పేర్కొంది. ఈ వృద్ధికి ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె, బెంగళూరు వంటి నగరాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

ఈ మార్పుపై కుష్‌మన్‌ అండ్ వేక్‌ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సరాఫ్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రపంచ డేటా సెంటర్ రంగం వృద్ధిలో కొత్త దశకు చేరుకుంది. ఇక్కడ డిమాండ్‌తో పాటు విద్యుత్ లభ్యత, మౌలిక సదుపాయాల సంసిద్ధత, నిర్మాణ సామర్థ్యం అత్యంత కీలకంగా మారాయి" అని వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా భారత్ పటిష్ఠ‌మైన స్థితిలో ఉందని, బలమైన డిమాండ్, విస్తరిస్తున్న డెవలప్‌మెంట్ పైప్‌లైన్, బహుళ నగరాల పర్యావరణ వ్యవస్థ దీనికి దోహదపడుతున్నాయని ఆయన తెలిపారు.

గ్లోబల్ డేటా సెంటర్ మార్కెట్‌లో హైదరాబాద్‌కు 9వ ర్యాంక్ 
భారత డేటా సెంటర్ల మార్కెట్‌కు ముంబై నగరం కేంద్రంగా నిలుస్తోంది. 2026 చివరి నాటికి ఈ నగరం 1 గిగావాట్ కార్యాచరణ సామర్థ్యాన్ని అధిగమిస్తుందని అంచనా. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె వంటి ద్వితీయ శ్రేణి మార్కెట్లు కూడా ఈ వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి. 

ముఖ్యంగా హైదరాబాద్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే టాప్ సెకండరీ మార్కెట్‌గా, ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచిందని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇది డేటా సెంటర్ల ల్యాండ్‌స్కేప్‌లో హైదరాబాద్ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది. మరోవైపు బెంగళూరును తృతీయ శ్రేణి మార్కెట్‌గా నివేదిక వర్గీకరించింది.

భారతదేశ దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలు కూడా ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆపరేటర్లు పెద్ద ఎత్తున భూములను సేకరిస్తున్నారు. ప్రస్తుతం 10.5 గిగావాట్లకు పైగా సామర్థ్యం ఇంకా భూమి దశలోనే ఉందని, ఇది రాబోయే రోజుల్లో భారీ అభివృద్ధికి సంకేతమని నివేదిక పేర్కొంది.