ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని మోదీని ఇరాన్‌ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ స్వయంగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత్‌ ఇప్పటివరకు ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతల విషయంలో శాంతి, చర్చల ద్వారానే పరిష్కారం కావాలని తన వైఖరిని కొనసాగిస్తోంది.

ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు జులై 4న ప్రారంభం కానున్నాయి. పలు దశల్లో జరిగే నివాళి కార్యక్రమాల అనంతరం జులై 9న ఆయన స్వస్థలమైన మష్హాద్‌లో ఖననం చేయనున్నారు. తెహ్రాన్‌, ఖోమ్‌ నగరాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఫిబ్రవరిలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాదాపు 36 ఏళ్ల పాటు ఆయన ఇరాన్‌కు సుప్రీం లీడర్‌గా సేవలందించారు. అంత్యక్రియలకు కోట్ల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ తరఫున కూడా ప్రతినిధి బృందం హాజరుకానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్‌ అధ్యక్షుడు తనను కూడా ఆహ్వానించారని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు.