ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ అత్యంత కీలక అంశంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే నేతలపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన జూమ్‌ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఎస్‌ఐఆర్‌పై విస్తృతంగా చర్చించారు. ఓటరు జాబితాల నుంచి నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందన్న నివేదికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే పది రోజుల పాటు నేతల పనితీరును పరిశీలిస్తామని, అలసత్వాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

గ్రామీణ స్థాయిలో అవగాహన పెంచడంలో సర్పంచ్‌లు కూడా చురుగ్గా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ అంశం చాలా సున్నితమైనదని, కొందరు నాయకులు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా వారీగా నివేదికలు తనకు అందాయని, పార్టీకి నష్టం కలిగే పరిస్థితులను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.

ప్రతి నియోజకవర్గంలో మరిన్ని అవగాహన సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ బాధ్యతలను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. ముఖ్యంగా పేదల ఓటు హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓటు కోల్పోతే ఇతర ప్రభుత్వ పథకాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల సంఘం గురువారం నుంచి ఇంటింటి ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ తమ కార్యాచరణను ముమ్మరం చేస్తున్నాయి.