దేశాన్ని రక్షించే సైనికులకు, స్థానిక లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్‌పై కర్రలు, రాడ్లతో ఆర్మీ సిబ్బంది దాడికి తెగబడ్డారనే ఆరోపణలపై.. ఒక కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా ఏకంగా 40 మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్‌గా మారింది

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... 17 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్. అరుణ్ గాంధీ, మేజర్ వికాశ్ శర్మ, నయిబ్ సుబేదార్ శంకర్ గుర్కే సహా 40 మంది ఆర్మీ జవాన్లపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, పోలీస్ స్టేషన్ లోపలికి చొరబడి విధుల్లో ఉన్న సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టడం వంటి తీవ్ర ఆరోపణలతో... వీరిపై హత్యాయత్నం, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చట్టాల కింద కఠినమైన లీగల్ సెక్షన్లు నమోదు చేశారు.

 

కిష్టవార్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఒక ఆర్మీ వాహనాన్ని లీగల్ రూల్స్ ప్రకారం సీజ్ చేయడమే ఈ గొడవకు అసలు కారణం. దీనిపై లోకల్ పోలీసులకు, ఆర్మీ వారికి మధ్య వాగ్వాదం జరగ్గా... ఆర్మీ సిబ్బంది ముందస్తు ప్లాన్‌తో లాఠీలు, ఐరన్ రాడ్లు, సార్టింగ్ సర్వీస్ వెపన్స్‌తో స్టేషన్‌కు వచ్చి దాడి చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ అటాక్‌లో డీఎస్పీ విజయ్ కుమార్ భగత్, ఎస్హెచ్ఓ అమృత్ కాటోచ్ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మేజర్ వికాశ్ శర్మ అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ ఎస్డీపీఓ (SDPO) పైనే భౌతిక దాడికి పాల్పడ్డారని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు.

ఈ ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో, రక్షణ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆర్మీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ప్రకటనలో రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. పోలీస్, మిలిటరీ సంయుక్త విచారణ అనంతరం తప్పు చేసిన వారిపై ఆర్మీ లీగల్ రూల్స్ ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని ప్రకటించారు.