ఈరోజు స్టాక్‌ మార్కెట్‌లో ఆరంభంలో మంచి ఊపు కనిపించింది. కానీ, చివరకు అమ్మకాల ఒత్తిడి పెరగడంతో లాభాలు గణనీయంగా తగ్గాయి. ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో విక్రయాలు పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి.

నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 24,056 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 109 పాయింట్లు లాభపడి 77,100 వద్ద స్థిరపడింది. ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, హిందాల్కో షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.55 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.47 శాతం చొప్పున నష్టపోయాయి.

రంగాల వారీగా చూస్తే మెటల్ సూచీ అత్యధిక నష్టాలు నమోదు చేసింది. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కూడా ఒత్తిడికి గురయ్యాయి. చమురు ధరలు తగ్గడం రూపాయికి మద్దతు ఇచ్చినప్పటికీ, మార్కెట్‌లో కొనుగోళ్ల ఉత్సాహాన్ని కొనసాగించడానికి అది సరిపోలేదని నిపుణులు పేర్కొన్నారు. తొలి త్రైమాసిక ఫలితాలపై ఉన్న ఆందోళనలు, వర్షాకాల పరిస్థితులు సమీప కాలంలో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు.