హైదరాబాద్ పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలతో అమర్యాదగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
"కష్టాల్లో ఉండి, మానసిక వేదనతో ఆసరా కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రజలతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా?" అంటూ అధికారులను సజ్జనార్ నిలదీశారు. కొన్ని స్టేషన్లలో రిసెప్షనిస్టులు, పరిపాలనా బాధ్యతలు చూసే అడ్మిన్ ఎస్సైల ప్రవర్తన సరిగా లేదని, సమయపాలన కూడా పాటించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపించినందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఇప్పటికే ఛార్జిమెమోలు జారీ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీపీ సజ్జనార్ ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. ఆయన స్వయంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. కొందరు పోలీసు అధికారులనే సాధారణ పౌరులుగా, సివిల్ డ్రెస్‌లో ఫిర్యాదులు చేసేందుకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. అక్కడ సిబ్బంది స్పందించిన తీరు, వారికి ఎదురైన అనుభవాలపై నివేదిక తెప్పించుకున్నారు.
ఈ రహస్య ఆపరేషన్‌లో దాదాపు 12 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది తీరు దారుణంగా ఉన్నట్లు వెల్లడైంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారితో రిసెప్షనిస్టులు, ఏఎస్సైలు కఠినంగా మాట్లాడటం, అది తమ పరిధిలోకి రాదంటూ పక్క స్టేషన్లకు నెట్టేయడం, సూటిపోటి మాటలతో వేధించడం వంటివి ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. అంతేకాకుండా, ఫిర్యాదును వెంటనే స్వీకరించకుండా 'రేపు రా.. మాపు రా..' అంటూ బాధితులను రోజుల తరబడి తిప్పించుకున్నట్లు స్పష్టమైంది.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సజ్జనార్ భావోద్వేగంగా మాట్లాడారు. "మీ కుటుంబ సభ్యులే ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఎదురైతే మీరెలా భావిస్తారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి" అని హితవు పలికారు. ఇకపై ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు.
బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం: సజ్జనార్..
