కర్ణాటకలోని హోసపేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చొరవతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకేచోట కలవడం చారిత్రాత్మకమని అన్నారు. కేంద్రమంత్రి తన చొరవతో మూడు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలనే కాకుండా, నదులను కూడా అనుసంధానించారని ఆయన వ్యాఖ్యానించారు.
మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ఈ ప్రాంత వాసులకు తాగునీటిని అందిస్తోన్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. 'తుంగా పానం, గంగా స్నానం' అనే సామెతను ప్రస్తావిస్తూ, తుంగ నది నీటి పవిత్రతను కొనియాడారు. 2024లో 19వ నంబర్ గేటు కొట్టుకుపోయినప్పుడు, నిపుణుడు కన్నయ్య నాయుడు సలహాతో స్టాప్‌లాక్ గేట్ అమర్చి నీటి వృధాను అరికట్టామని తెలిపారు. ఇప్పుడు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సమష్టిగా పనిచేసి 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసి, డ్యామ్‌ను పునరుద్ధరించి రైతుల ప్రయోజనాలను కాపాడామని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 'వన్ నేషన్ వన్ గ్రిడ్', టెలికాం, రహదారుల నెట్‌వర్క్ వంటి కార్యక్రమాలతో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశంలో గంగా-కావేరి నదుల్ని అనుసంధానిస్తే భారతదేశం అప్రతిహతంగా ముందుకు సాగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కెన్-బెత్వా ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం విజయవంతమైందని గుర్తుచేశారు. అదేవిధంగా గోదావరి-కావేరి నదులను అనుసంధానించడం ద్వారా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరతాయని సూచించారు.
ఈ ఏడాది ఎల్ నినో కారణంగా తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోయాయని, అందుకే నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకే నదుల అనుసంధానం కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. ముందుగా రాష్ట్రాల పరిధిలో అంతర్గతంగా నదులను అనుసంధానించుకుని, ఆ తర్వాత అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాలని సూచించారు.
విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి తుంగభద్ర నది సహజ రక్షణ కవచంగా నిలిచిందని, జోగులాంబ, హంపీ విరుపాక్ష ఆలయం, రాఘవేంద్ర మఠం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరానే వెలిశాయని చంద్రబాబు గుర్తుచేశారు. 'రాష్ట్రాలుగా మనం వేరైనా, దేశంగా మనం అంతా ఒక్కటే' అని పేర్కొంటూ, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రైతుల ప్రయోజనాలపై చర్చించడం శుభపరిణామమని అన్నారు. ఈ సమావేశం దక్షిణాది రాష్ట్రాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, అందరం కలిసికట్టుగా రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు...
