హీరోల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతుండటంతో సినిమా బడ్జెట్లు కంట్రోల్ తప్పిపోతున్నాయనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ... వాస్తవాలను వెల్లడించారు. సినిమా మార్కెట్ ఈక్వేషన్స్ ఏంటో తాను హీరోలకు ముందే క్లియర్‌గా చెబుతానని, తన బడ్జెట్ పరిధికి సెట్ అయ్యే హీరోలతోనే సినిమాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

అయితే,టాలీవుడ్ అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరని... దానికి కారణం పారితోషికం తగ్గితే మార్కెట్‌లో తమ ‘ఇమేజ్’ పడిపోతుందనే భయమేనని దిల్ రాజు చెప్పారు. ఒక వేళ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే... అందులో దాదాపు 35 శాతం నుండి 40 శాతం వరకు (అంటే రూ. 100 కోట్ల నుండి 120 కోట్లు) కేవలం ఒక్క హీరో రెమ్యునరేషన్‌కే వెళ్ళిపోతుందని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.


టాలీవుడ్ బడ్జెట్ సమస్యకు చెక్ పెట్టాలంటే హిందీ చిత్రసీమ ఫాలో అవుతున్న సరికొత్త బిజినెస్ స్ట్రాటజీని అనుసరించాలని దిల్ రాజు చెప్పారు. బాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోలు ముందే వందల కోట్లు డిమాండ్ చేయకుండా... సినిమా లాభాల్లో వాటా తీసుకునే ‘ప్రాఫిట్ షేరింగ్ మోడల్’కు షిఫ్ట్ అయ్యారన్నారు. దీనికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను బెస్ట్ ఉదాహరణగా చెప్పారు. ఒకప్పుడు అక్షయ్ ఒక్కో సినిమాకు రూ. 130 కోట్ల వరకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకునేవారని, కానీ ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఆయన కూడా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్నే ఎంచుకున్నారని తెలిపారు.