నగరంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆయా విభాగాధిపతులు చేస్తున్న ప్రచారం సత్ఫలితాలనిస్తోంది. తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గించేలా విద్యార్థులు నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలంటూ వారు ప్రచారం చేస్తూ పేరెంట్స్‌ను ఆకర్షిస్తున్నారు. విద్యార్థులు ఆటల్లో రాణించేందుకు భారీ క్రీడామైదానలతో పాటు ప్రభుత్వం అందజేసే ఉచిత బ్రేక్‌ఫాస్ట్‌, భోజన పథకాలను వర్తింపజేస్తున్నామంటూ ఆహ్వానం పలుకుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన 23 రోజుల్లోనే 8వేల మందికి అడ్మిషన్లు జరిగాయని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇది శుభ పరిణామమని, ప్రవేశాలకు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో పూర్తిస్థాయి అడ్మిషన్లు జరిగే అవకాశముందని అంటున్నారు.

 

ప్రైవేట్‌లో ఫీజుల భారం..

నగరంలోని ప్రైవేట్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో డే స్కాలర్‌కు రూ.1.20 లక్షలు.. రెసిడెన్షియల్‌లో రూ.2.30లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటితోపాటు లైబ్రరీ, స్పోర్ట్స్‌, యాప్‌ల పేరిట మరికొంత అదనంగా వసూలు చేస్తుంటారు. ఇంటర్మీడియట్‌ పూర్తయ్యేలోపు డే స్కాలర్‌లో ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.2.70 లక్షలు, రెసిడెన్షియల్‌లో రూ.5లక్షల వరకు పేరెంట్స్‌ చెల్లించాల్సి వస్తోంది. అయితే, అంత పెద్ద మొత్తంలో ఫీజుల భారాన్ని మోయకుండానే క్వాలిఫైడ్‌ అధ్యాపకులతో ఉచితంగా నాణ్యమైన విద్యను పొందవచ్చని ఆయా ప్రభుత్వ కళాశాలల విభాగాధిపతులు ప్రచారం చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

20శాతం అధికం..

జిల్లాలోని 22 ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైన ఈనెల 1 నుంచి 23వ తేదీలోపు 8,096 మంది అడ్మిషన్లు పొందారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 20శాతం అధికం. అత్యధికంగా హుస్సేనిఆలం బాలికల కళాశాలలో 850 మంది విద్యార్థులు చేరారు. అలాగే ఎంఏఎం బాలికల మోడల్‌ కాలేజీలో 833 మంది, సికింద్రాబాద్‌ వైఎంసీఏలో 757, ఫలక్‌నుమా బాలుర కాలేజీలో 660, ఫలక్‌నుమా బాలికల కళాశాలలో 572 మంది అడ్మిషన్లు పొందారు.

 

ప్రభుత్వ కాలేజీలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కాలేజీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నాణ్యమైన విద్య, ఉచిత భోజనం అందుతోంది. ఎలాంటి ఫీజులు లేకుండా రెండు సంవత్సరాలు ప్రశాంతంగా చదువుకోవచ్చు. విద్యార్థులకు తగిన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సిలబ్‌సను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.