తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే ఓ నవ వధువు కొండపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ఆలయానికి వెళ్లిన ఆమె, కోతులకు పండ్లు పెడుతున్న సమయంలో అవి ఒక్కసారిగా చుట్టుముట్టడంతో భయపడి కిందపడిపోయినట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. తూత్తుకుడిలోని సౌత్ తిట్టన్‌కుళం ప్రాంతానికి చెందిన అనిత (24)కు, విదేశాల్లో పనిచేసే సురేశ్ (29)తో గత నెలలోనే వివాహమైంది. ఇటీవల ఇంటికి వచ్చిన సురేశ్‌తో కలిసి అనిత కలుగుమలైలోని కలుగసాలమూర్తి ఆలయాన్ని సందర్శించారు. ప్రధాన ఆలయంలో పూజల తర్వాత ఈ జంట కొండపై ఉన్న ఉచ్చిపిళ్లైయార్ గుడికి వెళ్లారు. అక్కడ కోతులకు పండ్లు పెడుతుండగా, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కోతులు వారిని చుట్టుముట్టాయి.
దీంతో అనిత తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆ కంగారులో అదుపుతప్పి కొండపై నుంచి కిందపడిపోయిందని, అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భర్త కళ్లెదుటే ఈ ఘోరం జరగడంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. "కోతుల వల్లే ఆమె భయపడి ఉంటుందని భావిస్తున్నాం. దీనిపై విచారణ జరుపుతున్నాం" అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
సమాచారం అందుకున్న కలుగుమలై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోతులకు భయపడి కొండపై నుంచి పడి నవ వధువు మృతి
