వైసీపీ హయాంలో వందలకు పైగా కేసులు నమోదయ్యాయని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్యపై నిప్పులు చెరిగారు. ఎస్పీగా ఫకీరప్ప ఉన్న సమయంలో కక్షతో తనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని.. అమరావతి నుంచి ఆదేశాలు వచ్చాయని, తాను నిమిత్తమాతృడినే అంటూ ఎస్పీ చెప్పారని తెలిపారు. 420 లాయర్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తాడిపత్రిలో 300 మంది టీడీపీ నేతలపై 180 కేసులు పెట్టారన్నారు.
గత ప్రభుత్వంలో తాడిపత్రి మున్సిపాలిటీలో ఏం చేశారో చెప్పాలని జేసీ సవాల్ విసిరారు. తాను మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి 5 రూపాయలకు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ సిస్టం తీసుకొచ్చామన్నారు. కార్యకర్తలు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరని.. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై చెయ్యి వేస్తే ఊరుకునేది లేదన్నారు. మూడేళ్లు ఉంటే అంతు చూస్తామని వైసీపీ నాయకులు అంటే ఊరుకుంటామా అంటూ ఫైర్ అయ్యారు. కూటమిలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే వైసీపీ నేతలు రంకెలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. వైసీపీ హయాంలో గంజాయి సరఫరా జరిగిందని.. ఒడిషా, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేశారని ఆరోపించారు. ‘వచ్చే మంగళవారం(జూన్ 30) నగరంలోని కోర్టు ఎదుట టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేస్తా... నాపై పెట్టిన అక్రమ కేసుల గురించి 420 లాయర్లు చెప్పాలి’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
