చెన్నై సహా ఆరు జిల్లాల్లో మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా... కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర వరకు, తెలంగాణా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. ఈ కారణంగా, శనివారం తిరువళ్లూర్‌, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, రాణిపేట జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశముంది.

అలాగే, 28న విరుదునగర్‌, తెన్‌కాశి, తిరునల్వేలి జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, నీలగిరి, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, దిండుగల్‌, తేని, మదురై, కన్నియకుమారి జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాలు, 29న కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌ జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, నీలగిరి, తేని జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో ఈ నెల 30వ తేది వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.