ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ముందుగా కోడింగ్ ఉద్యోగాలే భారీ మార్పులను ఎదుర్కొంటాయని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అన్నారు. భారతీయ పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం కోడింగ్ పనులను ఏఐ వేగంగా ఆటోమేట్ చేస్తోందని, భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మొత్తం కూడా ఏఐ ఆధారితంగా మారే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఉత్పత్తుల రూపకల్పన, వినియోగదారుల అవసరాల అవగాహన, మార్కెట్ విశ్లేషణ, ఏఐ వ్యవస్థల నిర్వహణ వంటి అంశాల్లో మాత్రం మానవుల పాత్ర కొనసాగుతుందని చెప్పారు.

యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏఐతో పోటీ పడే ప్రయత్నం చేయకుండా, దానికి అనుబంధంగా ఉండే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అమోడీ సూచించారు. సెమీకండక్టర్లు, సంప్రదాయ ఇంజినీరింగ్, మానవ సంబంధాలు, విశ్లేషణాత్మక ఆలోచన అవసరమయ్యే రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్ రాబోయే రోజుల్లో అత్యంత విలువైన నైపుణ్యంగా మారుతుందని పేర్కొన్నారు. ఏఐ సృష్టించే నకిలీ ఫొటోలు, వీడియోల మధ్య నిజానిజాలను గుర్తించే సామర్థ్యం ప్రతి ఒక్కరికీ అవసరమని వివరించారు.

ఏఐను ఆలోచించకుండా ఉపయోగిస్తే మనుషుల నైపుణ్యాలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని డారియో అమోడీ హెచ్చరించారు. విద్యార్థులు హోంవర్క్ కోసం పూర్తిగా ఏఐపై ఆధారపడటం మోసంతో సమానమని వ్యాఖ్యానించారు. కోడింగ్‌లో కూడా ఏఐని సరైన విధంగా వినియోగిస్తే సామర్థ్యం పెరుగుతుందని, లేకపోతే నైపుణ్యాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏఐను నేర్చుకోవాలంటే కోర్సుల కంటే ప్రత్యక్షంగా ఉపయోగిస్తూ అనుభవం సంపాదించడమే ఉత్తమ మార్గమని ఆయన సూచించారు.