అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్, భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. భారత డెవలపర్లు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని పలు కీలక కార్యక్రమాలను మంగళవారం ఆవిష్కరించింది. బెంగళూరులో జరిగిన 'గూగుల్ ఐ/ఓ కనెక్ట్ ఇండియా 2026' సదస్సులో ఈ ప్రకటనలు చేసింది. విద్య, ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో కొత్త ఏఐ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. భారత్‌లో ఇంటర్నెట్ సేవలను విస్తరించడంలో గూగుల్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. సెర్చ్, ఆండ్రాయిడ్, యూట్యూబ్, గూగుల్ పే వంటి ఉత్పత్తులతో కోట్ల మంది జీవితాల్లో మార్పు తెచ్చిందని అన్నారు. వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, విద్యా విధానంలో గూగుల్ అసాధారణమైన ఆవిష్క‌ర‌ణ‌లు చేసిందని కొనియాడారు.

ఈ సదస్సులో భాగంగా గూగుల్ పలు ముఖ్యమైన ప్రకటనలు చేసింది. గూగుల్ డీప్‌మైండ్, 'ఏఐ రీసెర్చ్ ఫౌండేషన్స్' పేరుతో 56 గంటల ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాస్కామ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్‌ను అందివ్వనుంది. దీని ద్వారా భారీ లాంగ్వేజ్ మోడళ్లను (LLMs) రూపొందించడంలో నిపుణులకు శిక్షణ ఇస్తారు. అలాగే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఉపాధ్యాయుల కోసం 'ఏటీఎల్ సారథి' అనే జెమిని ఆధారిత అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. ప్రాథమికంగా 100 పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులతో కలిసి పనిచేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. తమ 'మెడ్‌జెమ్మా' ఓపెన్ ఏఐ మోడళ్లను ఉపయోగించి కుష్టు వ్యాధి, లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై భారత్‌కు ప్రత్యేకమైన టూల్స్ అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొంది. వీటిని దేశంలోని డెవలపర్లందరికీ అందుబాటులో ఉంచుతామని వివరించింది. దీంతో పాటు, గూగుల్ 'జెమిని లైవ్' ఇప్పుడు సంస్కృతం, భోజ్‌పురి, మైథిలి సహా 25 భారతీయ భాషలు, మాండలికాలకు సపోర్ట్ చేస్తుందని వెల్లడించింది.

ఇతర దేశాలతో పోలిస్తే భారత డెవలపర్లు ఏఐని అత్యంత వేగంగా వినియోగిస్తున్నారని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా తెలిపారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను అందించడంపై దృష్టి సారించామని వివరించారు. 2025లో గూగుల్ ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 5.3 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28 శాతం అధికమని గూగుల్ పేర్కొంది.