బరువు తగ్గాలంటే ముందుగా కొవ్వును తగ్గించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. శరీరంలో కొవ్వు ఎంత తక్కువగా ఉంటే అంత ఆరోగ్యమని కూడా చాలామంది నమ్ముతారు. నిజమే.. అధిక కొవ్వు ఊబకాయం, గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కానీ శరీరంలోని ప్రతి కొవ్వు హానికరం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన కొవ్వు కణాలు శరీరానికి ఎంతో అవసరమని, అవి దెబ్బతిన్నా లేదా తగ్గిపోయినా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మన శరీరంలోని కొవ్వు కణజాలం కేవలం అదనపు క్యాలరీలను నిల్వ చేసే స్టోర్ హౌస్ మాత్రమే కాదు. శక్తిని నిల్వ చేయడం, ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేయడం, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడం, జీవక్రియ సక్రమంగా జరిగేలా చూడడం వంటి కీలక బాధ్యతలను కూడా నిర్వహిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వు కణాలు ఆహారం ద్వారా వచ్చిన అదనపు కొవ్వును సురక్షితంగా నిల్వ చేస్తాయి. దీంతో కాలేయం, కండరాలు, ప్యాంక్రియాస్ వంటి అవయవాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా ఇన్సులిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ‘ఫ్యామిలియల్ పార్టియల్ లిపోడిస్ట్రోఫీ టైప్-2’ (FPLD2) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధిని అధ్యయనం చేశారు. ఈ సమస్య ఉన్నవారిలో శరీరంలోని కొన్ని భాగాల్లో ఆరోగ్యకరమైన కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది. ఆశ్చర్యకరంగా వీరిలో చాలామందికి అధిక బరువు లేకపోయినా మధుమేహం, ఫ్యాటీ లివర్, రక్తంలో కొవ్వు స్థాయులు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇందుకు గల కారణాలను తెలుసుకునేందుకు రోగుల కొవ్వు కణజాలాన్ని, అదే జన్యుపరమైన లోపం ఉన్న ఎలుకలను పరిశీలించారు.
కొవ్వు కణాలు పూర్తిగా నశించే ముందు వాటిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధనలో గుర్తించారు. మొదట అవి కొవ్వును నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తర్వాత ఆ కణజాలంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. రోగనిరోధక కణాలు అతిగా స్పందించి మరింత నష్టం కలిగిస్తాయి. అదే సమయంలో కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా పనితీరు కూడా దెబ్బతింటుంది. దీంతో కొవ్వు కణాలు తమ సహజ విధులను నిర్వహించలేక చివరకు క్రమంగా కనుమరుగవుతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వు కణాలు తగ్గిపోయినప్పుడు కాలేయం, కండరాల వంటి అవయవాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఇన్సులిన్ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు సరిగా గ్రహించలేక ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అంతేకాదు, కొవ్వు కణజాలం ఉత్పత్తి చేసే ఆకలి, జీవక్రియ, ఇన్సులిన్ స్పందనను నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా టైప్-2 మధుమేహం, ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలు లేదా చికిత్సకు సంబంధించిన నిర్ణయాల కోసం తప్పనిసరిగా వైద్యుణ్ని సంప్రదించాలి.
కొవ్వు అంతా హానికరం కాదన్న అధ్యయనం ఆరోగ్యకరమైన ఫ్యాట్ కణాలు శరీరానికి కీలకం..
