ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఏపీ హైకోర్టులో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా డీఎస్సీ నియామకాలకు సంబంధించిన అధికారిక రికార్డులు, అభ్యర్థుల సమాధాన పత్రాలు (ఆన్సర్ షీట్లు), లాగిన్ ఐడీలతో పాటు సంబంధిత డేటానంతటినీ వెంటనే సీజ్ చేసి భద్రపరిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.

 

గతంలో కూడా ఈ విషయమై పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను ఈనెల 20న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే, తగిన ఆధారాలు, డాక్యుమెంట్లు జతచేయకుండా చాలా సాధారణంగా పిటిషన్ దాఖలు చేశారంటూ ఆనాడు ధర్మాసనం ఆక్షేపించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది క్షమాపణలు కోరడంతో, సదరు పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తూనే... అన్ని ఆధారాలతో తాజాగా మరొక పిటిషన్ వేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. కోర్టు ఇచ్చిన ఆ ఆదేశాల మేరకు చంద్రశేఖర్‌రెడ్డి తాజాగా ఈ పిల్‌ను దాఖలు చేశారు.